పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి సీతక్క

పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి సీతక్క

మంగపేట, వెలుగు : కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి, ప్రతి హామీని నెరవేరుస్తోందని మంత్రి సీతక్క చెప్పారు. ములుగు జిల్లా మంగపేటలో పర్యటించిన మంత్రి ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలోని ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను దశల వారీగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్లాన్‌‌ రెడీ చేసుకోవాలని సూచించారు.

ఐటీడీఏలకు ప్రత్యేక నిధులు కేటాయించడమే కాకుండా, అదనంగా ఇందిరమ్మ ఇండ్లను సైతం మంజూరు చేశారన్నారు. మొదటి విడతలో రాని వారు ఆందోళన చెందొద్దని, రెండో విడతలో మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్న లబ్ధిదారులకు బిల్లులు త్వరగా చెల్లించాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఆమె వెంట కలెక్టర్‌‌ దివాకర టీఎస్‌‌, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ మహేందర్‌‌, తహసీల్దార్‌‌ రవీందర్‌‌ పాల్గొన్నారు.